*దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్య్రం* వచ్చిందని ఘనంగా చెప్పుకునేలా రూ.2 లక్షల రుణ మాఫీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.
దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, అందుకే రూ. 31 వేల కోట్లు వెచ్చించి తెలంగాణ రైతును రుణ విముక్తులు చేస్తున్నామన్నారు.
రుణమాఫీ కార్యక్రమంతో జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నానని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు ప్రజలనుద్దేశించి సందేశమిచ్చారు.
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రుణమాఫీ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారు.
రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుందని తెలిపారు.